- రాధా టీఎంటీ నేషనల్ సేల్స్ హెడ్ సుభాష్ చౌదరి
తెలంగాణలో రియల్ ఎస్టేట్ రంగం గాడిన పడి పరుగులు పెడుతోంది. పలు కంపెనీలు హైదరాబాద్ వైపు చూడటం, రీజనల్ రింగ్ రోడ్డు పనులు మొదలుకావడం వంటి పరిణామాలతో రియల్ రంగంలోకి పెట్టుబడులు కూడా వెల్లువలా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో స్టీల్ (టీఎంటీ బార్స్) కు కూడా డిమాండ్ పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ లోని రాధా టీఎంటీ నేషనల్ సేల్స్ హెడ్ సుభాష్ చౌదరి అభిప్రాయపడ్డారు. డిమాండ్ తగినట్టుగా సరఫరా చేయడానికి కూడా చాలామంది సన్నద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. అయితే, తెలంగాణలో స్టీల్ కొనుగోలు చేసేముందు ఏమేం చూడాలో ఆయన చెప్పారు. వివరాలు సుభాష్ మాటల్లోనే..
తెలంగాణలో టీఎంటీ బార్ లు వినియోగించేవారిని చిన్న బిల్డర్లు, పెద్ద బిల్డర్లు, ఇన్ ఫ్రా కాంట్రాక్టర్లు, వ్యక్తిగత గృహ నిర్మాణదారులుగా విభజించారు. వీరిలో ప్రతి ఒక్కరూ తమ అవసరాలకు తగిన విధంగా స్టీల్ కొనుగోలు చేస్తుంటారు. స్థానిక మేస్త్రి, ఇంజనీర్ లేదా టీఎంటీ డీలర్లు.. స్టీల్ ఏది కొనాలో ప్రభావితం చేయగలిగిన వ్యక్తులు. సాధారణంగా ఆ నిర్దిష్ట ప్రాంతంలో ఎక్కువ కాలం నుంచి ఉనికి కలిగి ఉన్న లోకల్ బ్రాండ్ వైపే వినియోగదారులు మొగ్గు చూపుతుంటారు. టాటా, వైజాగ్ స్టీల్ వంటి బ్రాండ్ లు మార్కెట్ లో తమదైన ముద్ర వేసుకున్నాయి. ప్రస్తుతం ఇంటర్నెట్ వినియోగం పెరగడంతో వినియోగదారులకు కూడా స్టీల్ పై అవగాహన పెరిగింది. తమ ఇంట్లో ఎలాంటి స్టీల్ వాడుతున్నారో, నాణ్యత గ్రేడ్ ఏది? అధిక గ్రేడ్ స్టీల్ అవసరమా.. కాదా? తయారీదారులు చెబుతున్న గ్రేడ్ నిజంగా ఉందా లేదా, బీఐఎస్ ప్రమాణాలను పాటిస్తున్న తయారీదారులు ఎవరు వంటి విషయాలను తెలుసుకుంటున్నారు. మరోవైపు తయారీదారులు సైతం వినియోగదారుల అంచనాలకు సరిపోయేలా ఎప్పటికప్పుడు సాంకేతికతను మెరుగుపరుచుకుంటూ నాణ్యమైన స్టీల్ అందించడానికి ప్రయత్నిస్తున్నారు.
భారతీయ ఇనుప ఖనిజంలో సల్ఫర్, ఫాస్పరస్ పుష్కలంగా ఉన్నాయని ఓ అధ్యయనంలో తేలింది. అధిక సల్ఫర్, ఫాస్పరస్ వంటి రసాయన కంటెంట్ తగ్గిన టీఎంటీ బార్ ల తయారీ కోసం 500డీ, 550డీ ఉత్పత్తులతో వస్తున్నారు. టాటా, జేఎస్ డబ్ల్యూ, జేఎస్ పీఎల్, ఆర్ఐఎన్ఎల్ వంటి అనే ప్రముఖ కంపెనీలు ఈ రసాయనాలు తగ్గించడానికి, 500డీ, 550డీ టీఎంటీ స్టీల్ బార్లను తయారుచేయడానికి లాడిల్ రిఫైనిండ్ ఫర్నేస్ అనే ప్రత్యేక టెక్నాలజీని వినియోగిస్తున్నారు. అన్ని గ్రేడ్ లలో 550డీ గ్రేడ్ స్టీల్ అధిక బలం, వంగే గుణం, మన్నిక, వెల్డింగ్ కు సానుకూలంగా ఉంటుంది. ధర కూడా కొంచెం ఎక్కువే ఉంటుంది. మొత్తమ్మీద 550డీ స్టీల్ ను కచ్చితమైన స్టీల్ బార్ గా పరిగణించవచ్చు. ఇకపై తెలంగాణలో స్టీల్ బార్ కొనేముందు అది 550డీ గ్రేడా కాదో చూసుకోండి.