-
- 2024లో 8.8 బిలియన్ డాలర్ల పెట్టుబడులు
- రెసిడెన్షియల్ విభాగంలోకి 45 శాతం నిధులు
- ఆఫీసు భవనాలకు 28 శాతం పెట్టుబడులు
సంస్థాగత పెట్టుబడుల పరంగా 2024 అదరగొట్టింది. ఈ ఏడాది చివరి నాటికి వివిధ అసెట్ క్లాస్ లలో ఏకంగా 8.8 బిలియన్ డాలర్ల మేర సంస్థాగత పెట్టుబడులు వెల్లువెత్తాయి. ఇందులో దాదాపు సగం పెట్టబడులు రెసిడెన్షియల్ విభాగంలోకి రావడం విశేషం. 2024లో రియల్ ఎస్టేట్ లావాదేవీలను పరిశీలిస్తే.. మొత్తం 8,878 బిలియన్ డాలర్ల మేర సంస్థాగత పెట్టుబడులు వచ్చినట్టు జేఎల్ఎల్ తన తాజా నివేదికలో వెల్లడించింది. గతేడాది వచ్చిన 5,878 బిలియన్ డాలర్లతో పోలిస్తే 51 శాతం వృద్ధితో అదనంగా 3 బిలియన్ డాలర్లు వచ్చినట్టు తెలిపింది.
2007లో గరిష్టంగా వచ్చిన 8.4 బిలియన్ డాలర్ల కంటే ఇది అధికమని పేర్కొంది. తాజాగా వచ్చిన 8.8 బిలియన్ డాలర్ల పెట్టుబడుల్లో 45 శాతం రెసిడెన్షియల్ విభాగంలోకి రాగా, ఆఫీస్ సెక్టార్‌లోకి 28 శాతం, వేర్ హౌసింగ్ రంగంలోకి 23 శాతం వచ్చినట్టు నివేదిక తెలిపింది. 2015 తర్వాత సంస్థాగత పెట్టుబడులపై ఆఫీస్ విభాగం ఆధిపత్యం చెలాయించగా.. 2024లో ఆ ధోరణి మారింది. ‘రెసిడెన్షియల్ సెక్టార్ స్టాండ్ అవుట్ పెర్ఫార్మర్గా ఉద్భవించింది. 49 లావాదావీల ద్వారా 4 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ పెట్టుబడులు ఆకర్షించింది. గతేడాదితో పోలిస్తే ఇది నాలుగు రెట్లు ఎక్కువ పెరిగింది.
లావాదేవీల పరిమాణంలోనూ కార్యాలయం రంగాన్ని 63 శాతం అధిగమించింది. ముఖ్యంగా, దేశీయ పెట్టుబడిదారులు రెసిడెన్షియల్ ప్రాపర్టీల వైపు మొగ్గు చూపగా, విదేశీ ఇన్వెస్టర్లు ఆఫీస్, వేర్‌హౌసింగ్ ఆస్తులకు తమ ప్రాధాన్యతను కొనసాగించారు’ అని జేఎల్ఎల్ ఇండియా చీఫ్ ఎకనామిస్ట్, రీసెర్చ్ అండ్ ఆర్ఈఐఎస్ హెడ్ సమంతక్ దాస్ పేర్కొన్నారు. కాగా, ఆఫీస్ పెట్టుబడులు 2024లో తిరోగమనాన్ని చవిచూశాయి. 2023తో పోలిస్తే 17 శాతం తగ్గుదల నమోదైంది. అయితే, ఇంతమేర క్షీణత ఉన్నప్పటికీ, ఈ రంగం ఇప్పటికీ 18 లావాదేవీల్లో 2.5 బిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆకర్షించింది.