బాలీవుడ్ దర్శకుడు సుభాష్ ఘయ్, ఆయన భార్య ముక్తా ఘయ్ ముంబై అంధేరిలోని తమ అపార్ట్ మెంట్ ను రూ.12.85 కోట్లకు విక్రయించారు. అంధేరీ వెస్ట్ ప్రాంతంలోని రుస్తోమ్ జీ ఎలీటా అనే భవనంలోని 14వ అంతస్తులో ఈ ఫ్లాట్ ఉంది. 2016 ఆగస్టులో రూ.8.72 కోట్లకు ఆయన ఈ అపార్ట్ మెంట్ కొనుగోలు చేశారు. 1760 చదరపు అడుగుల కార్పెట్ ఏరియా కలిగి ఉన్న ఈ ఫ్లాట్ కు రెండు కార్ పార్కింగ్ స్థలాలున్నాయి. తాజాగా ఈ ఫ్లాట్ ను రూ.12.85 కోట్లకు విక్రయించడంతో చదరపు అడుగు ధర రూ.72వేల చొప్పున పలికినట్టయింది.
సమీర్ గాంధీ అనే వ్యక్తి దీనిని కొనుగోలు చేశారు. జనవరి 22న రిజిస్ట్రేషన్ జరగ్గా.. రూ.77 లక్షలు స్టాంపు డ్యూటీ కింద, రూ.30వేలను రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించారు. అంధేరీ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో చదరపు అడుగు ధర రూ.50వేల కంటే ఎక్కువగా ఉంది. బ్రాండెడ్ డెవలపర్‌లు నిర్మించిన అనేక భవనాలు చదరపు అడుగుకు రూ.65 వేల పైనే పలుకుతోంది. అంధేరి ప్రాంతం ముంబై పశ్చిమ శివారులో ఉత్తర, దక్షిణ ముంబై మధ్యలో ఉంది. పలువురు బాలీవుడ్ నటులు, నిర్మాతలు, దర్శకులకు నిలయం. కాగా, బాలీవుడ్ స్టార్లు అమితాబ్ బచ్చన్, అక్షయ్ కుమార్ కూడా ఇటీవల అంధేరి, బోరివలి ప్రాంతంలో తమ అపార్ట్ మెంట్లను విక్రయించి వార్తల్లో నిలిచారు.