KING JOHNSON KOYYADA: హైదరాబాద్లో లగ్జరీ విల్లాల అమ్మకాలు ఎంత యమజోరుగా ఉన్నాయంటే.. రెరా అనుమతి లభించిన ఒకట్రెండు నెలల్లోనే నలభై లగ్జరీ విల్లాల్ని విక్రయించాం. ఎకరం విస్తీర్ణంలో నిర్మిస్తున్నది మహా అయితే రెండు విల్లాలే.. ఒక్కో ట్రిప్లేను 900 గజాల స్థలంలో.. పదివేల చదరపు అడుగుల్లో నిర్మిస్తున్నాం.. వీటిలో విల్లాలు కావాలని ఇంకా ముప్పయ్ నుంచి నలభై మంది వేచి చూస్తున్నారని ఆదిత్యా హోమ్స్ ఎండీ వి. కోటారెడ్డి తెలిపారు. కొవిడ్ సెకండ్ వేవ్ తర్వాత హైదరాబాద్‌లో నిర్మాణ రంగం స్థితిగతులు, తమ ప్రాజెక్టుల గురించి ఆయన రియల్ ఎస్టేట్ గురుతో ప్రత్యేకంగా మాట్లాడారు. నార్సింగిలో ప్రస్తుతం డెవలప్ చేస్తున్న విల్లా ప్రాజెక్టు పక్కనే.. వచ్చే ఆరు నెలల్లో సెకండ్ ఫేజును ఆరంభిస్తామని ప్రకటించారు. ఇంకా ఏమన్నారో సారాంశం ఆయన మాటల్లోనే..
కరోనా సెకండ్ వేవ్ తర్వాత హైదరాబాద్లో లగ్జరీ నిర్మాణాలకు గిరాకీ పెరిగింది. ఈ విభాగంలో కొనుగోలుదారులు ఎప్పుడూ అధిక విస్తీర్ణం గల ఇళ్లు కావాలనే కోరుకుంటారు. గతంలో సొంతింటి ఎంపికను ఆలస్యం చేసిన వారిలో చాలామంది తుది నిర్ణయానికి వచ్చేస్తున్నారు. ఇతర పెట్టుబడి మార్గాల వైపు చూసేవారూ.. మారిన పరిస్థితుల నేపథ్యంలో ఇళ్లను కొనడానికే ప్రాధాన్యతనిస్తున్నారు. నార్సింగిలో 17 ఎకరాల్లో ఆరంభించిన ఆదిత్యా రిజర్వ్ అనే 40 విల్లాల ట్రిప్లే ప్రాజెక్టులో ముప్పయ్ శాతం ఓపెన్ స్పేస్ వదిలేశాం. అంటే ప్రతి విల్లా ముందు, వెనకా ఖాళీ స్థలాన్ని వదిలేయడంతో ఎకరంలో వచ్చే విల్లాలు దాదాపు రెండంటే రెండే ఉంటాయి.
మొత్తం ఆరు ప్రాజెక్టులు..
ఫిలింనగర్ రామానాయుడు స్టూడియో చేరువలో లీ గ్రాండ్యూస్ 80 ఫ్లాట్ల లగ్జరీ ప్రాజెక్టు స్ట్రక్చర్ పూర్తయ్యింది. అమ్మకాలు 75 శాతం పూర్తయ్యాయి. వచ్చే అక్టోబరులో హ్యండోవర్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. ఇందులో ధర.. చదరపు అడుక్కీ రూ.12000 చెబుతున్నాం. మరో ప్రాజెక్టు అయిన ఆదిత్యా ఎథినా స్ట్రక్చర్ పూర్తయ్యింది. వచ్చే అక్టోబరులో హ్యాండోవర్ చేస్తాం. ఇవి కాకుండా మరికొన్ని ప్రాజెక్టుల్ని ఆరంభించేందుకు ప్రణాళికల్ని రచిస్తున్నాం. మంచిరేవులలో 14 ఎకరాల్లో హిడెన్ కోవ్స్ అనే 40 లగ్జరీ విల్లాల ప్రాజెక్టు.. 5 ఎకరాల్లో ఒక బోటిక్ విల్లా నిర్మాణాన్ని ఆరంభించేందుకు సన్నాహాలు చేస్తున్నాం. నార్సింగి జంక్షన్‌లో 33 అంతస్తుల ఎత్తులో ఒక ఐకానిక్ నిర్మాణాన్ని చేపట్టాలనే లక్ష్యంతో ఉన్నాం. ఇందులో మొత్తం 20 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని అభివృద్ధి చేస్తాం. పది ఎకరాల్లో మొత్తం 350 ఫ్లాట్లను కట్టేందుకు ప్రణాళికల్ని రచిస్తున్నాం.
ప్రస్తుత సమస్య..
హైదరాబాద్ రియల్ రంగంలో ఇళ్ల సరఫరా అధికమవుతోంది. ఇదొక్కటే ప్రస్తుతం మన నిర్మాణ రంగాన్ని వేధిస్తున్న సమస్య. కాబట్టి, సరఫరాను కాస్త అదుపులో ఉంచేందుకు స్వీయ నియంత్రణను పాటిస్తే ఉత్తమం. ఎవరికి వారే అధిక సంఖ్యలో నిర్మాణాల్ని చేపట్టకుండా.. మార్కెట్ గమనాన్ని క్షుణ్నంగా అధ్యయనం చేస్తూ అడుగు ముందుకేయాలి. నా విషయానికొస్తే.. ప్రస్తుతం కేవలం ఒక్క వర్టికల్ నిర్మాణాన్ని మాత్రమే ప్లాన్ చేస్తున్నాను. అంటే సాంద్రత తక్కువ ఉండాలన్నదే నా ఉద్దేశ్యం. లగ్జరీ విభాగంలో హైరైజ్ కట్టొచ్చు. కానీ, అందుబాటు గృహాల్ని ప్లాన్ చేస్తే నిర్వహణలో సమస్యలు తలెత్తే ప్రమాదం లేకపోలేదు.
యూడీఎస్‌కు వ్యతిరేకం..
వ్యక్తిగతంగా నేనయితే యూడీఎస్ అమ్మకాలకు పూర్తిగా వ్యతిరేకం. ప్రజల వద్ద సొమ్ము తీసుకుని ప్రాజెక్టుల్ని ప్రారంభించడమేమిటి? అంత కావాలంటే.. ఒక గృహనిర్మాణ ప్రాజెక్టుని ఆరంభించాక.. అందులో నిర్మాణ పనుల్ని మొదలు పెట్టాక ఫ్లాట్లను విక్రయించడం కరెక్టు పద్ధతి. దాని ప్రకారమే నిర్మాణాల్ని చేపట్టొచ్చు. దీనికి విరుద్ధంగా అసలు ప్రాజెక్టును ప్రారంభించడానికి ప్రజల వద్ద సొమ్ము తీసుకోవడం కరెక్టు కాదు. ప్రాజెక్టుకు మొదలు పెట్టేందుకు చేతిలో అడ్వాన్సుల్లేక.. భూమిని కొనేందుకు సొమ్ము లేక.. అందుకోసం యూడీఎస్ ద్వారా సొమ్మును సేకరించి.. స్థలయజమానుల చేతిలో పోయడం కరెక్టు కాదు. అలా చేస్తే ఆయా సంస్థ ఆర్థికంగా ఎంత బలహీనంగా ఉన్నట్లు? ఒక్కసారి ఆలోచించాలి. ప్రాజెక్టు విలువలో కనీసం యాభై శాతం సొమ్మును చేతిలో ఉన్నప్పుడు లేదా మొబలైజ్ చేయగలిగిన తర్వాత ఆరంభిస్తేనే నిర్మాణాన్ని విజయవంతం చేయగలమని నేను గట్టిగా నమ్ముతాను. డెవలపర్లు ఆర్థికంగా బలంగా లేకుండా నిర్మాణాల్ని ఆరంభిస్తే ఒక్కోసారి కుప్పకూలే ప్రమాదముంది.
ప్రాజెక్టుమధ్యలో వదిలేస్తే?
యూడీఎస్ వల్ల ఏమాత్రం అనుభవం లేనివారంతా ఈ రంగంలోకి వస్తారు. వారూ ప్రజల సొమ్మును తీసుకుని ప్రాజెక్టును మధ్యలో వదిలేస్తే నిర్మాణ రంగానికి ఎంత చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి, ప్రజలందరూ ఫ్లాట్లను కొనేటప్పుడు డెవలపర్ గత చరిత్రను క్షుణ్నంగా గమనించాలి. గతంలో ఎక్కడ ప్రాజెక్టుల్ని ఆరంభించాడు.. సకాలంలో ప్రాజెక్టుల్ని అందజేయగలడా అనే విషయాన్ని ఆరా తీయాలి. కేవలం ధర తక్కువ కదా అని ఎవరి దగ్గర పడితే వారి వద్ద కొంటే అంతే సంగతులు.
బూర్జ్ ఖలిఫా ఫెయిల్!
ఆర్థికంగా ఎంతో దృఢమైన అంతర్జాతీయ హబ్ అయిన దుబాయ్ వంటి నగరంలోనే బూర్జ్ ఖలీఫా విజయవంతం కాలేదు. వంద అడుగులు లేదా 120 అడుగుల రోడ్డు ఉంది కదా అని ఆకాశహర్మ్యాల్ని కట్టుకుంటూ పోతే ఎలా? భవిష్యత్తులో వాటికి రంగులేయాలన్నా.. ఇతరత్రా నిర్వహణ సమస్యలొచ్చినా ఎంత కష్టం అవుతుంది? పైగా మన వద్ద ఆకాశహర్మ్యాల్ని మెయింటెయిన్ చేసే మెకానిజం ఇంకా అభివృద్ధి చెందలేదు. చివరగా, కష్టార్జితంతో ఫ్లాట్లు కొనేవారు తప్పనిసరిగా డెవలపర్ గత చరిత్రను పూర్తిగా తెలుసుకున్నాకే అడుగు ముందుకేయాలి.
– ఆదిత్యా హోమ్స్ ఎండీ వి.కోటారెడ్డి