Categories: LEGAL

అన్సల్ ప్రాపర్టీస్ ఎండీకి కోర్టు సమన్లు

నేరపూరిత కుట్ర కేసులో హాజరు
కావాలని ప్రణవ్ అన్సల్ కు ఆదేశం

నేరపూరిత కుట్రకు పాల్పడటం, తప్పుడు సమాచారం సమర్పించడం, తప్పుడు ఆధారాలు ఇవ్వడం వంటి నేరాలకు పాల్పడినందుకు రియల్ ఎస్టేట్ టైకూన్ సుశీల్ అన్సల్ కుమారుడు, అన్సల్ ప్రాపర్టీస్ అండ్ ఇన్ ఫ్రాస్టక్చర్ లిమిటెడ్ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రణవ్ అన్సల్ కు ఢిల్లీ కోర్టు సమన్లు జారీ చేసింది. ప్రణవ్ తోపాటు మరికొందరు ఫిర్యాదుదారు సునీల్ మంగళ్ ను కంపెనీలోని తన హోదాకు రాజీనామా చేయాలని ఒత్తిడి చేయడంతోపాటు ఆయన్ను, ఆయన భార్యను విపరీత పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని బెదిరించారని మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ దేవాన్షి జన్మేజ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో మంగళ్ తన ఉద్యోగానికి రాజీనామా చేసి, తన వేతనం కోసం మూడు సివిల్ వ్యాజ్యాలు దాఖలు చేశారు. దీనికి కౌంటర్ గా ప్రణవ్ తదితరులు మంగళ్ కు, ఆయన భార్యకు వ్యతిరేకంగా రెండు పోలీస్ స్టేషన్లలో తప్పుడు క్రిమినల్ ఫిర్యాదులు చేశారని న్యాయమూర్తి పేర్కొన్నారు. సాక్ష్యాధారాలు పరిశీలించిన తర్వాత ప్రణవ్ తదితరులు తదుపరి విచారణ జరిగే జూలై 31న కోర్టు ముందు హాజరు కావాలని సమన్లు జారీ చేశారు.

This website uses cookies.