గుర్గావ్ డీఎల్ఎఫ్ ప్రాజెక్టులో రూ.69 కోట్లకుకొనుగోలు
టీమిండియా మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ అల్ట్రా లగ్జరీ ఫ్లాట్ కొనుగోలు చేశారు. గురుగ్రామ్ లోని డీఎల్ఎఫ్ ది డహ్లియాస్ లో రూ.69 కోట్లకు ఫ్లాట్ కొన్నారు. 6,040 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ అపార్ట్ మెంట్ ధర రూ.65.61 కోట్లు కాగా, స్టాంపు డ్యూటీతో కలిపి రూ.68.89 కోట్లు అయింది. అంటే చదరపు అడుగు ధర రూ.1.04 లక్షలు పడింది.
గుర్గావ్ సెక్టార్ 54లోని గోల్ఫ్ కోర్స్ రోడ్‌లో ఈ ప్రాజెక్టు ఉంది. ఫిబ్రవరి 4న ఈ లావాదేవీ రిజిస్టర్ అయింది. అపార్ట్ మెంట్ కొనుగోలులో భాగంగా ఐదు కార్ పార్కింగ్ స్థలాలు కూడా వస్తాయి. డహ్లియాస్ లో 173 అల్ట్రా లగ్జరీ అపార్ట్ మెంట్లను 9 వారాల్లో దాదాపు రూ.11,816 కోట్లకు విక్రయించినట్టు డీఎల్ఎఫ్ తెలిపింది. పెద్దకంపెనీల సీఈఓలు, ప్రవాస భారతీయులు సహా అల్ట్రా హై నెట్ వర్త్ వ్యక్తుల నుంచి బలమైన డిమాండ్ ఉండటమే ఇందుకు కారణమని పేర్కొంది.
బేర్ షెల్ అపార్ట్ మెంట్లతో కూడిన ఈ ప్రాజెక్టు నాలుగేళ్లలో పూర్తవుతుందని డీఎల్ఎఫ్ హోమ్ డెవలపర్స్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ ఆకాశ్ ఓహ్రి పేర్కొన్నారు. కామెల్లియాస్ కంటే డహ్లియాస్ కంటే విలాసవంతంగా ఉంటుందని వివరించారు. ఈ అల్ట్రా-లగ్జరీ యూనిట్ల పరిమాణం దాదాపు 10,000 చదరపు అడుగుల నుంచి ప్రారంభమై 19వేల చదరపు అడుగుల వరకు ఉంటాయి. వీటి ధరలు రూ.55కోట్ల నుంచి రూ.125 కోట్ల వరకు ఉన్నాయి.
రెండు పెంట్ హౌస్ లు ఒక్కోటీ రూ.150 కోట్లకు అమ్ముడయ్యాయి. డహ్లియాస్ ప్రాజెక్టు 7.5 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుంది. మొత్తం 8 టవర్లు.. 29 అంతస్తుల్లో 420 యూనిట్లు ఉన్నాయి. అలాగే 3.5 లక్షల చదరపు అడుగుల్లో 15 ప్రత్యేకమైన డ్యూప్లెక్స్ పెంట్ హౌస్ లు ఉన్నాయి. ఈ ఫ్లాట్లు 4 మీటర్ల ఫ్లోర్-టు-సీలింగ్ హైట్ తో ఉంటాయి. కాగా, ధావన్ 2015లో ఆస్ట్రేలియాలో 7.30 లక్షల డాలర్లతో ఓ ఇల్లు కొన్నారు. అలాగే ఢిల్లీలో రూ.5 కోట్ల విలువైన ఇల్లు కూడా ధావన్ కు ఉంది.