కోకాపేటలో నిర్వహించిన భూముల వేలంలో ఎకరం ధర రూ.100 కోట్లు దాటడం చాలామందిని ఆశ్చర్యపరిచింది. ఇది తెలంగాణ పరపతికి నిదర్శనమంటూ సీఎం కేసీఆర్ గర్వంగా ప్రకటించారు కూడా. అయితే, దీనిపై మిశ్రమ స్పందనలు వ్యక్తమయ్యాయి.
ఇప్పటికే స్తిరాస్తి ధరలు సామాన్యులు భరించే స్థితిలో లేవు. ఈ పరిస్థితుల్లో ఎకరం ధర రూ.100 కోట్లు దాటడం అంటే.. సామాన్యుల సొంతింటి కల మరింత దూరమవుతుందనే విశ్లేషణలు వినిపించాయి. అయితే, ఇలా ఎకరం ధర రూ.100 కోట్లు పలకడం వెనుక ప్రభుత్వ ప్రమేయం ఉందంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. హైదరాబాద్ నగరం పెట్టుబడుల గమ్యస్థానంగా కొనసాగడానికి, నగర ఖ్యాతి మరింత పెరగడానికి ధరలు తగ్గించవద్దని రియల్ రంగంలోని కొందరు బడా బిల్డర్లకు ప్రభుత్వంలోని కీలక వ్యక్తులు సలహా ఇచ్చారనే ప్రచారం జరుగుతోంది.
ప్రస్తుత పరిస్థితుల్లో ధరలు తగ్గితే అది రియల్ మార్కెట్ పై ప్రతికూల ప్రభావం చూపిస్తుందని.. అందువల్ల ధర తగ్గకుండా చూడాలని కోరినట్టు సమాచారం. ఇందుకోసం ఎన్నికల తర్వాత మరిన్ని మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు చేపడతామని ప్రభుత్వం సదరు బిల్డర్లకు హామీ ఇచ్చిందని రియల్ వర్గాల టాక్.
తెలంగాణ ప్రగతికి కొలమానంగా హైదరాబాద్ స్తిరాస్తి ధరలనే ప్రభుత్వం చూపిస్తోంది. కోకాపేట భూములు రికార్డు స్థాయిలో అమ్ముడపోవడానికి కారణం వివిధ పరిశ్రమలకు హైదరాబాద్ కు ఉన్న ఆకర్షణే కారణమనే ప్రచారం బాగా జరిగింది. అయితే, నిజానికి వేలంలో అంత ధర పలకడానికి కారణం ఇది కాదనే వాదన బలంగా వినిపిస్తోంది. రియల్ ఎస్టేట్ మార్కెట్ ఏజెన్సీల నుంచి వచ్చిన నివేదికలే దీనికి నిదర్శనమంటున్నారు. కరోనా తర్వాత హైదరాబాద్ లో రెసిడెన్షియల్ ప్రాపర్టీల ధరలు 30 నుంచి 50 శాతం పెరిగాయి. ముంబై తర్వాత హైదరాబాద్ రెండో ఖరీదైన మార్కెట్ గా నిలిచింది. దీంతో మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి ప్రజలకు ఇంటి కొనుగోలు భారంగా పరిణమించింది. అయినప్పటికీ ధరల్లో ఎలాటి తగ్గుదల లేదు. ముఖ్యంగా కొందరు బడా బిల్డర్లు ధరల్ని తగ్గించడం కంటే వారి ఇన్వెంటరీని అలాగే ఉంచుకుంటున్నారని తెలిసింది. వాస్తవానికి కోకాపేట వేలం తర్వాత హైరైజ్ భవనాల్లో చదరపు అడుగు ధర రూ.500 నుంచి రూ.1000 మేర పెంచేశారు. ఇది అటు సాధారణ బిల్డర్లను వ్యాపారానికి దూరం చేస్తుండగా.. మధ్య స్థాయి ఆదాయ కలిగి ఉన్నవారి సొంతింటి కలను సాకారం కాకుండా చేస్తోంది.