Categories: LATEST UPDATES

గ్రీన్ మెట్రో ప్రీలాంచ్ మోసం!

రియ‌ల్ ఎస్టేట్ రంగంలో మ‌రో మోసం వెలుగులోకి వ‌చ్చింది. 2020లో గ్రీన్ మెట్రో సంస్థ ఆరంభించిన తుల‌సీ భాగ్య‌న‌గ‌ర్ అనే ప్రాజెక్టులో ఫ్లాట్లు కొన్న కొంత‌ మంది బ‌య్య‌ర్ల‌కు నేటి వ‌ర‌కూ రిజిస్ట్రేష‌న్ చేయ‌లేదు. దీంతో, చిర్రెత్తుకొచ్చిన కొనుగోలుదారులు సీసీఎస్‌లో తుల‌సీ భాగ్య‌న‌గ‌ర్‌, చ‌క్కా వెంకట సుబ్ర‌మ‌ణ్యంల మీద కేసు ఫైల్ చేశారు. టీఎస్ రెరాకు ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించిన వివ‌రాల్ని ప‌లువురు బాధితులు మీడియా ముందు వెల్ల‌డించారు.

2020లో కొంత‌మంది బ‌య్య‌ర్లు క‌లిసి గ్రీన్ మెట్రో ఇన్‌ఫ్రాటెక్ సంస్థ‌కు చెందిన తుల‌సీ భాగ్య‌న‌గ‌ర్ అనే ప్రాజెక్టులో ప్రీలాంచ్ ఆఫ‌ర్ కింద ఫ్లాట్ల‌ను కొనుగోలు చేశారు. ఒక్కొక్క బ‌య్య‌ర్ సుమారు 25 నుంచి 30 ల‌క్ష‌ల దాకా చెల్లించారు. ఇలా సుమారు వంద మంది దాకా బ‌య్య‌ర్లు ఫ్లాట్ల‌ను కొనుగోలు చేశారు. అయితే, బ్యాంకు లోన్ ద్వారా కొన్న వారిలో కొంద‌రికి రిజిస్ట్రేష‌న్ జ‌రిగింది. వంద శాతం సొమ్ము చెల్లించిన వారికి నేటికీ రిజిస్ట్రేష‌న్ జ‌ర‌గ‌లేదు. ఇదే విష‌యాన్ని గ్రీన్ మెట్రో ఎండీ బొడ్డు అశోక్‌ను సంప్ర‌దిస్తే.. మీ ఇష్టం ఏం చేస్తారో చేసుకోండంటూ అన‌డంతో ఖంగుతిన్నారు. అంతేకాదు, త‌మ‌ మీదే దాడి చేయ‌డానికి ప్ర‌యత్నించార‌ని బాధితులు ఆరోపించారు.

స‌మ‌స్య ఎక్క‌డ‌?

2020లో క‌రోనా స‌మ‌యంలో.. గ్రీన్ మెట్రో సంస్థ ఏం చేసిందంటే.. తుల‌సీ భాగ్య‌న‌గ‌ర్ ప్రాజెక్టులో ఫ్లాట్ల అమ్మ‌కాల్ని చేసేందుకు భువ‌న‌తేజ సంస్థ‌కు అప్ప‌గించింది. దీంతో, ఆ సంస్థ ఎండీ చ‌క్కా వెంక‌ట‌సుబ్ర‌మ‌ణ్యం ఏం చేశారంటే.. ఆయా సైటులోనే స్టాఫ్‌ను ఏర్పాటు చేసుకుని.. ఫ్లాట్ల‌ను విక్ర‌యించారు. ప్రాజెక్టు సైటులోనే కూర్చోని ఫ్లాట్ల‌ను విక్ర‌యిస్తుండ‌టం.. పైగా ప్రీలాంచ్‌లో ధ‌ర త‌క్కువ‌గా ఉండ‌టంతో.. కొనుగోలుదారులు హండ్రెడ్ ప‌ర్సంట్ సొమ్ము చెల్లించారు. కాక‌పోతే, బ‌య్య‌ర్ల నుంచి తీసుకున్న సొమ్మును భువ‌న‌తేజ సంస్థ ఎండీ చ‌క్కా సుబ్ర‌మ‌ణ్యం గ్రీన్ మెట్రో సంస్థ‌కు చెల్లించ‌లేదని రియ‌ల్ ఎస్టేట్ గురు ప‌రిశోధ‌న‌లో తేలింది. ఇదే విష‌యాన్ని బ‌య్య‌ర్లు గ‌త నాలుగేళ్ల నుంచి సంస్థ ఎండీ బొడ్డుకు అశోక్‌కు చెబుతూనే ఉన్న‌ప్ప‌టికీ.. అత‌ను పెద్ద‌గా ప‌ట్టించుకోలేద‌ని స‌మాచారం. భువ‌న‌తేజ నుంచి సొమ్ము వ‌చ్చిన‌ప్పుడే తాను రిజిస్ట్రేష‌న్ చేస్తాన‌ని భీష్మించుకుని కూర్చున్నాడు. మ‌రి, చ‌క్కా వెంక‌ట సుబ్ర‌మ‌ణ్యం ఇదే ప్రీలాంచ్ మోసంలో అరెస్టై ఇటీవ‌ల హైకోర్టు నుంచి బెయిల్ పొంది బ‌య‌టికొచ్చిన విష‌యం తెలిసిందే. మ‌రి, ఈ బ‌య్య‌ర్ల‌కు న్యాయం జ‌రిగేలా ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకోవాలి.

This website uses cookies.