దేశంలో నిత్యావసరాలు, ఇతర ఉత్పత్తుల ప్రవాహం సాఫీగా సాగేలా చేయడంలో గిడ్డంగులది కీలకపాత్ర. భారత్ గ్లోబల్ ట్రేడ్ పవర్ హౌస్ గా తనను తాను నిలబెట్టుకోవడం కోసం అంతర్జాతీయంగా ఉన్న ఉత్తమ పద్ధతులును అవలంభించడం ద్వారా గిడ్డంగులను అభివృద్ధి చేసుకోవడం అత్యవసరం అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ), రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ వంటి సాంకేతికతలు గిడ్డంగి కార్యకలాపాల్లో విప్లవం తీసుకొచ్చాయి. ఈ విధానాలు వాటి సామర్థ్యం, కచ్చితత్వన్ని పెంపొందిస్తాయి. దేశంలో ప్రస్తుతం గిడ్డంగుల నిర్వహణలో ఉన్న లోపాలను తగ్గించడానికి, ఉత్పాదకతను మరింత మెరుగుపరచడానికి ఈ సాంకేతికతలను అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. దీనివల్ల దీర్ఘకాలికంగా ప్రయోజనాలు ఉంటాయని పేర్కొంటున్నారు.
పారదర్శకతతో కూడిన సరఫరా చైన్ అనేది విజయవంతమైన అంతర్జాతీయ గిడ్డంగుల తొలి లక్షణం. అధునాతన ట్రాకింగ్ వ్యవస్థ ద్వారా సులభతరం అయిన రియల్ టైమ్ విజిబిలిటీతోపాటు జవాబుదారీతనాన్ని నిర్దారించడమే కాకుండా వినియోగదారులకు పూర్తి సంతృప్తిని ఇవి కలిగిస్తాయి. ఎండ్ టు ఎండ్ విజిబిలిటీని అందించడం అత్యంత ప్రాముఖ్యత కలిగిన అంశమని భారతీయ గిడ్డంగులు గుర్తించాలన్నదే నిపుణుల మాట. దీనివల్ల వాటాదారుల మధ్య నమ్మకం పెరుగుతుందని, తద్వారా ప్రపంచ మార్కెట్లో వారి పోటీతత్వాన్ని పెంచుతుందని చెబుతున్నారు. అలాగే ప్రముఖ అంతర్జాతీయ గిడ్డంగులు పర్యావరణ అనుకూల పద్ధతులు అవలంభిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారతీయ గిడ్డంగులు కూడా హరిత కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. సాంకేతికత కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ, గ్లోబల్ వేర్ హౌస్ ల విజయం నైపుణ్యం కలిగిన, అనుకూలించే శ్రామికశక్తిపై ఆధారపడి ఉందనేది తిరుగులేని అంశం.
This website uses cookies.