నోయిడాలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన సూపర్ టెక్ ట్విన్ టవర్స్ కూల్చివేతపై సందిగ్ధత నెలకొంది. వాటిని ఎలా కూల్చివేయాలనే విషయంపై అధికారులు తర్జనభర్జనలు పడుతున్నారు. కూల్చివేతకు సుప్రీంకోర్టు నిర్దేశించిన గడువు ఇక నెలరోజులు మాత్రమే ఉంది. అయితే, ఇప్పటికీ దీనిపై అధికారులు ఎలాంటి ప్రణాళికనూ ఖరారు చేయకపోవడంతో గడువులోగా కూల్చివేత జరుగుతుందా అనే సందేహాలు నెలకొన్నాయి.
నిబంధనలను ఉల్లంఘించి నిర్మించిన ట్విన్ టవర్స్ ను మూడు నెలల్లోగా కూల్చివేయాలని ఈ ఏడాది ఆగస్టు 31న సుప్రీంకోర్టు ఆదేశించింది. దీని ప్రకారం నవంబర్ 30 కల్లా పని పూర్తికావాలి. ఈ నేపథ్యంలో తాజాగా మూడు కంపెనీలకు చెందిన అధికారులు, అమెరికా, బ్రిటన్ కు చెందిన నిపుణులు నోయిడా అధికారులతో సమావేశమై చర్చించారు. అయితే, ఎవరూ కూడా నిర్దిష్టమైన ప్రణాళికను సూచించలేదు. ఈ సమావేశంలో కంపెనీలన్నీ తమ అనుభవం గురించి, గతంలో తాము కూల్చిన పెద్ద భవంతుల గురించి వివరించాయి. అయితే, ఆ భవనాల చుట్టూ కావాల్సినంత ఖాళీ స్థలం ఉందని.. అందువల్లే వాటిని సురక్షితంగా కూల్చివేయడాని వీలైందని..
కానీ సూపర్ టెక్ టవర్స్ వద్ద ఆ పరిస్థితి లేదని నోయిడా అథార్టీ అధికారి తెలిపారు. ట్విన్ టవర్స్ ని కూల్చివేసినప్పుడు ఆ పక్కనే ఉన్న 12 అంతస్తుల భవనంపై ప్రభావం పడే అవకాశం ఉందని అంటున్నారు. ఆ రెండింటికీ మధ్య కేవలం 9 మీటర్ల దూరం మాత్రమే ఉండటంతో ట్విన్ టవర్స్ కూల్చివేత ఎలా చేపట్టాలనే విషయంపై తర్జనభర్జనలు పడుతున్నారు. ప్రస్తుతం ఆ 12 అంతస్తుల భవనంలో చాలామంది నివసిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ ట్విన్ టవర్స్ ని రోడ్డు, పార్కు ఉన్న వైపు కూల్చివేయాలని సమావేశంలో అభిప్రాయం వ్యక్తమైంది. ప్రస్తుతం తమ ముందు ఆ ఒక్క ఆప్షన్ మాత్రమే ఉందని నోయిడా అథార్టీ అధికారి పేర్కొన్నారు.
This website uses cookies.