Categories: LATEST UPDATES

రంగు పడింది!

    • పెరగనున్న పెయింట్ ధరలు

ఇంటి నిర్మాణం రోజురోజుకూ భారం అవుతున్న తరుణంలో సామాన్యులకు పెయింట్ కంపెనీలు కూడా షాక్ ఇచ్చాయి. ఏసియన్ పెయింట్స్, బెర్జర్ పెయింట్స్ కంపెనీలు రంగుల ధరలు పెంచాలని నిర్ణయం తీసుకున్నాయి. ఇటీవల కాలంలో ఎన్నడూ లేనంత ఎక్కువగా ధరలు పెంచుతున్నాయని బ్రోకరేజి సంస్థలు తెలిపాయి. డెకరేటివ్ పెయింట్ సెగ్మెంట్ లో మార్కెట్ లీడర్ గా ఉన్న ఏసియన్ పెయింట్స్.. రంగుల ధరలను 7 నుంచి 10 శాతం మేర పెంచాలని భావిస్తున్నట్టు కోటక్ ఇన్ స్టిట్యూషనల్ ఈక్విటీస్ పేర్కొంది. గత ఆరునెలల్లో దాదాపు 7.5 శాతం మేర రేట్లు పెంచిన ఈ సంస్థ.. తాజాగా ఒకేసారి ఇంత మొత్తం పెంచడం గమనార్హం. ఎనామిల్స్ మినహా మిగిలినవాటిపై 10 శాం పెంచినట్టు కోటక్ ఈక్విటీస్ తెలిపింది.

ఎనామిల్స్ పై 6 నుంచి 7శాతం పెంచిందని వివరించింది. అలాగే బెర్జర్ పెయింట్స్ కూడా ఈ మేరకు తన రంగులు ధరలు పెంచాలని భావిస్తున్నట్టు వెల్లడించింది. కొత్త ధరలు నవంబర్ 12 నుంచి వర్తిస్తాయని తెలిపింది. 2008 తర్వాత ఒకేసారి ఇంత పెద్దమొత్తం ధరలు పెంచడం ఇదే తొలిసారని పేర్కొంది. ఏడాది కాలంగా ద్రవ్యోల్బణం పెరుగుతుండటంతో ఉత్పాదక వ్యయాలు గణనీయంగా పెరిగి లాభాలపై ప్రభావం పడటంతో పెయింట్ కంపెనీలు ధరలు పెంచక తప్పలేదు. ఈ విషయాన్ని ఏసియన్ పెయింట్స్ సీఈఓ అండ్ ఎండీ అమిత్ సింగ్లే ఈ నెల మొదట్లోనే సూచనప్రాయంగా వెల్లడించారు. రెండో త్రైమాసిక ఫలితాలు చెప్పే క్రమంలో ముడి పదార్థాల ధరలు గణనీయంగా పెరిగి, నికర లాభాలపై తీవ్ర ప్రభావం పడిందని వివరించారు

This website uses cookies.