కొన్ని రియల్ సంస్థలు ఏజెంట్లను ఎలా ఊరిస్తాయో చెప్పడానికి నిదర్శనమిదే. ఈ రివార్డులను చూస్తే ఎవరికైనా మతిపోవాల్సిందే కదా? శ్రీ లక్ష్మీ ఆగ్రో ఫామ్స్ అండ్ ప్రాజెక్ట్స్ అనే సంస్థ.. టీమ్ రివార్డు కింద.. పది మంది కస్టమర్లతో రెండు లక్షలు డౌన్ పేమెంట్ చెల్లించేవారికి స్విఫ్ట్ కారును గిఫ్టుగా ఇస్తుందని ప్రకటించింది. 5 లక్షల సొమ్మును ముందస్తుగా ముప్పయ్ మందితో కట్టిస్తే ఇన్నోవా క్రిస్టా.. ఏడున్నర లక్షలు యాభై మందితో కట్టిస్తే ఫార్చ్యూనర్, పది లక్షలు చొప్పున వంద మందితో కట్టిస్తే బీఎండబ్ల్యూ ఇస్తారట. మరి, ఈ స్థాయిలో బడా గిఫ్టులను చూసి.. యువత రెట్టింపు ఉత్సాహంతో పని చేయకుండా ఉంటుందా చెప్పండి? వీటిని అందుకోవడానికి తెలిసినవారితో, బంధుమిత్రులతో కూడా కొందరు ఏజెంట్లు కొనిపిస్తారు. రెండు, మూడేళ్లు దాటిన తర్వాత ఆయా వెంచర్ ఆరంభం కాకపోతేనే అసలు సమస్య ఆరంభమవుతుంది. అందులో స్థిరాస్తిని కొనిపించిన ఏజెంట్లకు చుక్కలు కనిపిస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు.
రియల్ ఎస్టేట్లో కొనసాగాలని నిర్ణయం తీసుకున్న యువత ఆలోచించాల్సిన విషయం ఒక్కటే. రెరా అనుమతులున్న ప్రాజెక్టు లేదా వెంచర్‌లోనే అమ్మడానికి ప్రయత్నించాలి. ఇందులో సొమ్ము తక్కువే వస్తుందనడంలో సందేహం లేదు. కాకపోతే, అది స్థిరంగా ఉంటుంది. అందులో ఎలాంటి సమస్యలు ఏర్పడినా మీరు చింతించాల్సిన అవసరం లేదు. టీఎస్ రెరా అథారిటీయే ఆయా బాధ్యతను తీసుకుని.. బాధితులకు న్యాయం చేస్తుంది. అధిక కమిషన్‌కు ఆశపడి, ప్రీలాంచుల్లో లేదా ఫామ్ ల్యాండ్లలో పెట్టుబడి పెట్టిస్తే.. తర్వాత ఎక్కడ్లేని సమస్యలు ఎదురవుతాయి. భువనతేజ ఇన్‌ఫ్రా ఒక ఏజెంటు ఫ్లాట్లను బుక్ చేయిస్తే.. అతనికి సంస్థ నయాపైసా కమిషన్ చెల్లించలేదట. ఉల్టా అతనే రెండు లక్షలు చెల్లించి ఫ్లాట్ బుక్ చేసి అడ్డంగా ఇరుక్కుపోయాడట. కాబట్టి, మోసపూరిత రియల్ సంస్థలతో వ్యాపారం మొదట్లో బాగానే ఉంటుంది. కాలం గడిచే కొద్దీ సమస్యలు చుట్టుకుంటాయనే విషయాన్ని గుర్తించాలి.
This website uses cookies.