Categories: TOP STORIES

ఇంతింత కాద‌యా.. పెరిగిన ఇంటి అద్దెలు

  • స్కూళ్లు, కాలేజీలు తెరుచుకోవడంతో అందరూ నగరానికి
  • ఆఫీసులు ఆరంభం
  • ఫలితంగా అద్దెల్లో పెరుగుదల

హైదరాబాద్ లో అద్దె గృహాలకు డిమాండ్ పెరుగుతోంది. ఏటా సగటున 42 శాతం పెరుగుదల నమోదవుతోంది. అదే సమయంలో అద్దె గృహాల లభ్యత 9.4 శాతం పెరిగింది. ఉపాధి అవకాశాల కోసం నగరాలకు వలసలు పెరుగుతున్న కారణంగా త్రైమాసికాలవారీగా సగటు అద్దెలు కూడా 14.3 శాతం పెరిగాయి. అద్దె గృహాల్లో 3 బీహెచ్ కే 45 శాతం వాటాతో ఆధిపత్యంలో ఉండగా.. 40 శాతంతో 2 బీహెచ్ కే రెండో స్థానంలో ఉంది. భారత్ లో అద్దె గృహాల కోసం వెతుకుతున్నవారి శాతం 2022 రెండో త్రైమాసికంలో 29.4 పెరగ్గా.. వార్షికంగా 84.4 శాతం పెరుగుదల నమోదైనట్టు ఓ వెబ్ సైట్ వెల్లడించింది. దేశవ్యాప్తంగా 13 నగరాల్లో అద్ధె గృహాల లభ్యత త్రైమాసికంగా 3 శాతం పెరగ్గా.. వార్షికంగా 28.1 శాతం పెరిగినట్టు తెలిపింది.

స్కూళ్లు, కాలేజీలు ప్రారంభం కావడం.. కార్యాలయాల నుంచి పని చేయడం మొదలుకావడంతో విద్యార్థులు, ఉద్యోగులు, కార్మికులు తిరిగి వారి స్వస్థలాల నుంచి మెట్రోలకు వస్తుండటంతో అద్దె ఇళ్లకు డిమాండ్ పెరిగింది. గత త్రైమాసికంతో పోలిస్తే అద్దె గృహాల సరఫరా నెమ్మదిగా పెరుగుతోందని.. అందుబాటులో ఉన్న ఖాళీ గృహాలు తగ్గుతున్నాయని వివరించింది. మరోవైపు పెరుగుతున్న గ్యాప్ కొత్త గృహాల సరఫరా ద్వారా వేగంగా భర్తీ కావడం లేదని.. ఎందుకంటే వాటిలో చాలా ఇళ్లను వినియోగదారులు కొనుగోలు చేస్తున్నారని పేర్కొంది. అయితే, రానున్న‌ త్రైమాసికాల్లో అద్దె ఇళ్ల కొత్త సరఫరాలో వృద్ధి కనిపించే అవకాశం ఉందని నివేదిక అభిప్రాయపడింది.

నివేదికలోని ముఖ్యాంశాలివీ..

  • ఢిల్లీలో నివాస మార్కెట్లకు మొత్తం డిమాండ్ త్రైమాసికాల వారీగా 21.5 శాతం వృద్ధి నమోదు కాగా, సరఫరా మాత్రం 5.5 శాతమే పెరిగింది. ఇక సగటు అద్దెలు 8.8 శాతం పెరిగాయి. ప్రధాన హబ్ లకు అద్భుతమైన మెట్రో కనెక్టివిటీ, సామాజిక, రిటైల్ మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండటంతోపాటు సరసమైన అద్దె ప్రాపర్టీల లభ్యత వంటి కారణాలు అద్దె గృహాల డిమాండ్ పెరుగుదలకు కారణాలుగా చెప్పొచ్చు.
  • ముంబై నివాస మార్కెట్ లో డిమాండ్ 12.8 శాతం పెరగ్గా.. సరఫరా మాత్రం 8.2 శాతం తగ్గింది. అదే సమయంలో అద్దెలు 8.4 శాతం పెరిగాయి.
  • బెంగళూరులో నివాస మార్కెట్ ఏకంగా 54.5 శాతం పెరుగుదలతో దూసుకెళ్తోంది. సరఫరాలో 15.1 శాతం వృద్ధి నమోదు కాగా, 2 బీహెచ్ కేలకే అత్యధిక డిమాండ్ కనిపిస్తోంది.
  • చెన్నైలో అద్దె గృహాల డిమాండ్ 8.6 శాతం పెరగ్గా.. సరఫరా మాత్రం 17.4 శాతం పెరగడం విశేషం. ఇక సగటు అద్దెలు కూడా 4.4 శాతం పెరిగాయి.
  • గ్రేటర్ నోయిడాలో కూడా నివాస్ మార్కెట్ డిమాండ్ పెరిగింది. గృహాల డిమాండ్ 42.9 శాతం పెరగ్గా.. సరఫరా 4.3 శాతానికి తగ్గి అద్దెలు 5.8 శాతం పెరిగాయి.
  • పుణెలో నివాస మార్కెట్ డిమాండ్ 39.6 శాతానికి పెరిగి.. సరఫరా స్థిరంగా ఉంది. ఇక సగటు అద్దెలె 9.5 శాతం పెరిగాయి.

This website uses cookies.