Categories: Celebrity Homes

లాన్ చూసి మోజుపడ్డా!

  • రియల్ ఎస్టేట్ గురుతో నటుడు సంతోష్ శోభన్

సెలబ్రిటీలకు సంబంధించి ప్రతి విషయమూ ఆసక్తికరమే. ఇక ఇంటికి సంబంధించి వారి అభిప్రాయాలు, అభిరుచులు ఇంకా ఆసక్తి కలిగిస్తాయి. ఈ నేపథ్యంలో ఈ వారం ‘ఏక్ మినీ కథ’ ఫేమ్ సంతోష్ శోభన్ తో రియల్ ఎస్టేట్ గురు ముచ్చటించింది. తాను పుట్టిన నగరంలో త్వరలోనే రాబోయే కొత్త ఇంటి పనులతో ఎంత బిజీగా ఉన్నారో తెలుసుకుంది. మరి సొంతింటి గురించి ఆయన చెప్పిన విశేషాలు ఏమిటో ఓసారి చూసేద్దామా?

‘నా మొదటి ఇల్లు మాదాపూర్ సమీపంలోని శ్రీరాంనగర్ లో ఉంది. ఇది చాలా పాపులర్ ప్రాంతం. ప్రస్తుతం ఇప్పుడు అక్కడ అత్యంత విలువైన ఫ్లాట్లు ఉన్నాయి. కానీ మా ఆర్థిక పరిమితుల కారణంగా మేం తరచుగా ఇల్లు మారుతూ ఉండాల్సి వచ్చింది. అయితే, నేను కలలు కన్న అత్యంత ఆధునికమైన ఫ్లాట్ లో ప్రస్తుతం ఉంటున్నాను. ఇంకా కొత్త ఇంటిని కొనే ప్రయత్నాల్లో ఉన్నాను. దాని గురించి తెలుసుకోవాలని కుతూహలంలో మునిగిపోయాను. ఈ క్రమంలో చాలా విషయాలు నేర్చుకుంటున్నాను.

ఇక ఇంటికి సంబంధించి ఎప్పుడైనా సరే మినిమలిస్టిక్ గా వెళ్లాలన్నదే నా నిర్ణయం. నాకు ఏదీ చిందరవందరగా ఉండకూడదు. భవిష్యత్తులో నా ఇంటి నుంచి నాకు శక్తి వస్తుంది. కాబట్టి అనేక వస్తువులతో దానిని నింపేయాలని అనుకోవడంలేదు. ప్రస్తుతం కలల ఇంటిని నిర్మించేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నాను. ఇది పూర్తయిన తర్వాత నాకు మంచి అనుభూతి లభించడం ఖాయం. మినిమలిస్టిక్ గా వెళ్లడం అనేది మొత్తం జీవనశైలినే మార్చేస్తుంది’ అని సంతోష్ శోభన్ వివరించారు.
ప్రస్తుతం కొత్త ఇంటిని కొనడానికి, దానిని అందంగా అలంకరించుకోవడానికి కావాల్సినవన్నీ ఆయన దగ్గర ఉన్నాయి. ఈ నేపథ్యంలో తన ఇంటిని ఎలా అలంకరించుకోవాలని సంతోష్ భావిస్తున్నారో చూద్దాం. ‘పెద్ద లాన్ కలిగి ఉన్న ఫ్లాట్ ని సొంతం చేసుకోబోతున్నాను. అతిపెద్ద లాన్ చూసి వెంటనే మోజుపడి ఓకే చేసుకున్నాను. నా ఇంట్లో ప్రతి దానికీ ఓ కారణం ఉంటుంది. విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి బదులుగా బాధ్యతాయుతమైన మార్గంలో వెళ్లడానికే మొగ్గు చూపుతాను. మీ ఇంట్లో తక్కువ వస్తువులతో నివసిస్తుంటే, వాటిని శుభ్రం చేయడానికి, చక్కగా అలంకరించుకోవడానికి తక్కువ సమయాన్నే వెచ్చిస్తారు. ఈ లాజిక్ కరెక్టే కదా’ అని ప్రశ్నించారు. ఇంకా కొనసాగిస్తూ.. ‘నేను చాలా కాలం నుంచి బయట షెడ్యూల్ లో ఉన్నాను. దీంతో ఎక్కువ సమయం ఇంటికి వెళ్లలేదు. నేను విరామం లేని వ్యక్తిని. నేను నా ఇంట్లో ప్రతి గదిలో తిరుగుతూ ఉండటాన్నే మీరు చూస్తారు. షూటింగ్ లేకుంటే ఇంట్లోనే ఉంటాను. వర్కవుట్ చేస్తాను. డ్యాన్స్ నేర్చుకుంటాను. కిక్ బాక్సింగ్ క్లాసులకు వెళతాను. ఇంకా సిరీస్ లు అతిగా చూడటాన్ని ఇష్టపడతాను. అందువల్ల గదిలోనే మీరు నన్ను ఎక్కువగా చూస్తారు’ అని వివరించారు.

కూనురులో కట్టుకుంటా!

ప్రపంచంలో మరో ఇంటిని ఎక్కడ కట్టుకుంటారని అడగ్గా.. కూనూర్ అని శోభన్ పేర్కొన్నారు. ‘కూనూర్ తో నాకు మధురమైన అనుబంధం ఉంది. నీలి కొండలు, తేయాకు తోటల మధ్య వాలులో కలల సౌధాన్ని కట్టుకోవడం ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. నందినిరెడ్డి షూటింగ్ కోసం అక్కడ 40 రోజులు ఉన్నాను. అది చాలా చక్కటి ప్రదేశం. ఇంకా అక్కడ రద్దీ కూడా తక్కువే. అక్కడ అంతా చాలా అవాస్తవంగా అనిపిస్తుంది. ఇల్లు కట్టుకోవడానికి నా మరో ఆప్షన్ స్విట్జర్లాండ్. అక్కడ ఇల్లు ధరలు చాలా ఎక్కువగా ఉంటాయి. కానీ సూపర్ ప్లేస్ గురూ. దానిని భూలోక స్వర్గం అని అనడం ఏమాత్రం అతిశయోక్తి కాదు. చాలెట్ వంటి ఇళ్లు అక్కడ బాగా ప్రాచుర్యం పొందాయి’ అని తెలిపారు.

ఇక తన కొత్త ఇంటి గురించి మరింత వివరిస్తూ.. ‘మీరు నా ఇంట్లో చాలా చూస్తారు. చాలా తక్కువ ఒత్తిడి కలిగి ఉంటుంది. నిజంగా అర్థవంతమైన, అవసరమైన వస్తువులు మాత్రమే నా ఇంట్లో ఉంటాయి. ఇక నాకు చాలామంది టాలీవుడ్ సెలబ్రిటీ మిత్రులు లేనందు వల్ల నేనేమీ ఒంటరి కాదు. కానీ నా బాల్య స్నేహితుడి ఇల్లు నన్ను బాగా ఆకట్టుకుంటుంది. అతడి పేరు అభిజిత్. తన ఇంట్లో చాలా విశాలమైన స్థలం ఉంటుంది. అది చూడటానికి, అక్కడ ఉండటానికి చాలా ప్రశాంతంగా ఉంటుంది’ అని చెప్పి శోభన్ ముగించారు.

This website uses cookies.