కింగ్ జాన్సన్ కొయ్యడ : ప్రపంచం ఆర్థిక మాంద్యంలో కొట్టిమిట్టాడుతున్నా.. బడా ఐటీ సంస్థలు ఉద్యోగుల్ని తొలగిస్తున్నా.. హైదరాబాద్‌లో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితి కనిపిస్తుంది. అమెరికాకు చెందిన మైక్రోచిప్ సంస్థ కోకాపేట్‌లోని వన్ గోల్డన్ మైల్‌లో.. దాదాపు 1.68 లక్షల చదరపు అడుగుల ఆఫీసు సముదాయాన్ని సొంతం చేసుకుంది. భవిష్యత్తులో ఈ నగరం అప్రతిహతంగా అభివృద్ధి చెందుతుందన్న ఏకైక నమ్మకంతో.. జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు హైదరాబాద్‌లోకి అడుగు పెడుతున్నాయి. మరి, ఈ సంస్థను అంతగా ఆకర్షించిన వన్ గోల్డన్ మైల్ ఐటీ బిల్డింగ్ ప్రత్యేకతలేమిటి? ఈ సంస్థ కోకాపేట్‌ను ఎంచుకోవడానికి గల కారణాలేమిటి?
అమెరికాలని ఆరిజోనాలో షాండ్లర్ ప్రధాన కార్యాలయంగా పని చేసే మైక్రోచిప్ టెక్నాలజీ సంస్థ.. భారతదేశంలో తమ కార్యకలాపాల్ని ముమ్మరం చేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలో వచ్చే పదేళ్లకు సరిపడా కార్యకలాపాల్ని నిర్వహించేందుకు హైదరాబాద్‌ని ఎంచుకోవడం విశేషం. ఈ సంస్థ ప్రధానంగా అధ్యయనం, అభివృద్ధి విభాగంలో తమ ప్రత్యేకతను చాటిచెప్పుకోవడానికి ప్రయత్నిస్తోంది. ప్రపంచంలో పేరెన్నిక గల ఐటీ సంస్థలు ఆర్థిక మాంద్యం పేరిట ఉద్యోగుల్ని తొలగిస్తుంటే.. మైక్రోచిఫ్ సంస్థ మాత్రం భవిష్యత్తు అభివృద్ధిపై దృష్టి సారించడం విశేషం. ‘‘మైక్రోచిప్ ఇటీవలి సంవత్సరాల్లో గణనీయమైన మరియు స్థిరమైన వృద్ధిని పొందింది. భారతదేశంలోని మా బృందం ఆ విజయానికి కీలక సహకారం అందించింది. ఈ తాజా పెట్టుబడి భారతదేశంలో మా సామర్థ్యాలను విస్తరించడానికి మరో అడుగు అని చెప్పొచ్చు. ఇది ప్రాంతీయంగా మరియు ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ దీర్ఘకాలిక వ్యాపార అవకాశాలను అందిస్తుంద’’ని మైక్రోచిప్ ఇండియా ఎండీ శ్రీకాంత్ సెట్టీకేరె తెలిపారు.
కోకాపేట్ హాట్ లొకేషన్..
హైదరాబాద్లో కోకాపేట్ అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చెందుతోంది. ఈ ప్రాంతంలో ఏర్పాటయ్యే అతిపెద్ద దేశ, విదేశీ సంస్థలే ప్రత్యక్ష ఉదాహరణగా చెప్పొచ్చు. కోకాపేట్‌లోని వన్ గోల్డన్ మైల్ ప్రీమియం కమర్షియల్ ప్రాపర్టీని ఆరియన్, ఎస్కార్, టెర్మినస్ అనే సంస్థలు కలిసికట్టుగా అభివృద్ధి చేస్తున్నాయి. ఈ మొత్తం బిల్డింగ్ విస్తీర్ణం.. ఐదు లక్షల చదరపు అడుగులు. ఇందులో ఆఫీసులు, హై స్ట్రీట్ రిటైల్ వంటి వాటిని ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ భవనం ప్రత్యేకత ఏమిటంటే.. దీనికి అమెరికాకు చెందిన గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ (యూఎస్ జీబీసీ) నుంచి లీడ్ గోల్డ్ రేటింగ్ ప్రీ సర్టిఫికేషన్ లభించింది. ఈ భవనం డిజైన్, స్పెసిఫికేషన్లను గమనిస్తే అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసిన విషయాన్ని ఎవరికైనా ఇట్టే అర్థమవుతుందని వన్ గోల్డన్ మైల్ మేనేజింగ్ పార్ట్‌నర్లు పుష్కిన్ రెడ్డి, రిత్విక్ మాలీలు తెలిపారు. ‘‘సెమీ-కండక్టర్ పరిశ్రమలో ఆవిష్కరణలో హైదరాబాద్ ముందంజలో ఉంది. మైక్రో చిప్ సంస్థ కోకాపేట్‌లో 1.68 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని తీసుకోవడంతో.. సెమీ కండక్టర్ సంస్థలకు నగరం ప్రధాన కేంద్రంగా అభివృద్ధి చెందేందుకు పరుగులు పెడుతోంద’’ని కుష్‌మన్ అండ్ వేక్ ఫీల్డ్ హైదరాబాద్ ఎండీ వీరబాబు అభిప్రాయపడ్డారు.
ఔటర్ రింగ్ రోడ్డు నుంచి ఒక కిలోమీటర్ లోపు కోకాపేట్ ఉంది. రెండు ప్రధాన రహదారుల ద్వారా వన్ గోల్డన్ మైల్‌కు సులువుగా చేరుకోవచ్చు. దీనికి చేరువలో అత్యున్నత స్థాయి విల్లా కమ్యూనిటీలు ఉన్నాయి. ఎలాంటి ఇబ్బందుల్లేకుండా వన్ గోల్డన్ మైల్‌కు సులువుగా రాకపోకలను సాగించొచ్చు.
వన్ గోల్డన్ మైల్ విశిష్ఠత ఏమిటంటే.. ఆరు మీటర్ల ఎత్తులో తీర్చిదిద్దిన ఆఫీసు లాబీ ఎంతో గ్రాండ్‌గా కనిపిస్తుంది. ఈ విషయం బయట్నుంచి చూస్తే ఎవరికైనా ఇట్టే అర్థమవుతుంది. బడా సైజులో ఉన్న ఈ లాబీ సందర్శకులను ఇట్టే ఆకట్టుకుంటుంది.
వన్ గోల్డన్ మైల్లోకి ప్రవేశించగానే.. ప్రశాంతమైన నీటి కొలను మీకు స్వాగతం పలుకుతుంది. ఆఫీసులోకి అడుగుపెట్టగానే సరికొత్త అనుభూతి కలుగుతుంది.
మృదువు గల శబ్దం లేని 8 ఎలివేటర్ల వల్ల మీ మెదడు ను ప్రశాంతంగా ఉంచుతాయి. వన్ గోల్డన్ మైల్ ఎలివేటర్లు కనీసం 14.3 సెకండ్లలోపు ఆఫీసులోకి అడుగుపెట్టొచ్చు. ఇలా ఒకేసారి సుమారు 24 మంది ఈ లిఫ్టులను వినియోగించవచ్చు.
అందరూ ఒకే చోటకు!
వన్ గోల్డన్ మైల్ ల్యాండ్ స్కేప్ ను ఆకర్షణీయంగా తీర్చిదద్దారు. ఎంట్రీ జోన్, ఆఫీస్ జోన్, రిటైల్ జోన్లుగా డిజైన్ చేశారు.
ఆఫీసు స్పేస్ కిందే కేఫ్‌టీరియాలు, లాంజ్‌లు ఉండటం వల్ల మీరు కోరుకున్నంత సేపు సమావేశాల్ని నిర్వహించుకోవచ్చు. ఇక్కడే ప్రీమియం షాపులు, ఎఫ్అండ్‌బీ ఔట్‌లెట్ల ఏర్పాటు చేసుకోవచ్చు. గ్రౌండ్ మరియు ఫస్ట్ ఫ్లోరులో రిటైల్ ఏరియాకు రహదారి నుంచి కూడా వెళ్లొచ్చు.
ఆఫీసు స్పేస్ మరియు రిటైల్ స్పేస్ మధ్య గల స్థలాన్ని ఔట్ డోర్ డైనింగ్, ఈవెంట్లు, ఆఫీసు కార్యక్రమాల కోసం వినియోగించుకోవచ్చు.
బ్యాంకులు, కెఫేలు, ఫుడ్ కోర్టు, జిమ్ వంటివి ఉంటాయి.