Categories: LATEST UPDATES

ఏపీలో కొత్త పట్టణాభివృద్ధి సంస్థ

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా పట్టణాభివృద్ధి సంస్థను ఏర్పాటు చేసింది. 2008లో ఏర్పాటైన విశాఖపట్నం- కాకినాడ పెట్రోలియం కెమికల్స్, పెట్రో కెమికల్స్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్ (వీకే- పీసీపీఐఆర్) స్థానంలో కొత్తగా వీకే పీసీపీఐఆర్ యూడీఏని ఏర్పాటు చేసింది. ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. పాత రీజియన్లో ఏడు రెవెన్యూ మండలాలు, 32 గ్రామాలుండగా.. కొత్తగా ఏర్పాటైన పట్టణాభివృద్ధి సంస్థలో పది రెవెన్యూ మండలాలు, 97 గ్రామాలున్నాయి. వైకాపా కార్యకర్త చొక్కాకుల లక్ష్మీని చైర్ పర్సన్గా, విశాఖ మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ కమిషనర్ను శాశ్వత సీఈవోగా నియమించింది. ఛైర్ పర్సన్ పదవీకాలం రెండేళ్లు కాగా.. విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్లతో సహా పది మందిని సభ్యులుగా నియమించింది. విశాఖపట్నం జిల్లా కరాడ గ్రామం నుంచి తూర్పు గోదావరి జిల్లాలోని వాకలపూడి వరకూ 640 చదరపు కిలోమీటర్ల ప్రాంతం దీన్ని పరిధిలోకి రానుంది.

వీకే- పీసీపీఐఆర్ మాస్టర్ ప్లాన్ 2031లో భాగంగా ఇండస్ట్రీయల్ క్లస్టర్లు, ఎక్స్ప్రెస్ వే, మేజర్ ట్రాన్స్పోర్ట్ నెట్ వర్క్, రెసిడెన్షియల్ టౌన్షిప్స్, నాలెడ్జ్ హబ్స్ ఏర్పాటు చేయాలని భావిస్తోంది. దాదాపు రూ.2 లక్షల కోట్ల పెట్టుబడుల్ని సమీకరించడం ద్వారా దేశంలోనే అతి పెద్ద పెట్రో కెమికల్ హబ్గా చేయాలని యోచిస్తోంది. ఈ ప్రాజెక్టు వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు పన్నెండు లక్షల ఉద్యోగాలు వస్తాయని అంచనా వేస్తోంది.

This website uses cookies.