Categories: LATEST UPDATES

బెంగాల్లో త‌గ్గిస్తే.. తెలంగాణలో పెంచారు!

  • స్టాంప్ డ్యూటీ తగ్గించిన మమత
  • మార్కెట్ విలువల్ని పెంచిన కేసీఆర్

కరోనా కష్టకాలంలో రియల్ ఎస్టేట్ రంగానికి ఊరటనిచ్చేలా బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మరోసారి చక్కని నిర్ణయం తీసుకున్నారు. స్టాంపు డ్యూటీ తగ్గింపును మరో రెండు నెలల పాటు పొడిగించారు. స్టాంప్ డ్యూటీలో 2 శాతం మినహాయింపుతో పాటు సర్కిల్ రేట్లలో 10 శాతం తగ్గింపును మార్చి 31 వరకు అమలు చేస్తామని ప్రకటించారు.

బడ్జెట్ లో ప్రకటించిన రాయితీల మేరకు ఈ రెండూ గతేడాది అక్టోబర్ 30 వరకు అమలు చేయాల్సి ఉంది. అయితే, వివిధ వర్గాల నుంచి వచ్చిన విన్నపాల నేపథ్యంలో రెండు విడతలుగా జనవరి 31 వరకు పొడిగించారు. తాజాగా ఆ గడువు కూడా ముగియడంతో మరో రెండు నెలలపాటు దీనిని పొడిగిస్తూ మమత నిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల చాలా ప్రాజెక్టులకు ఊరట లభించడంతోపాటు కొనుగోలుదారులు లబ్ధి పొందారు. దీంతో దాదాపు రూ.75వేల కోట్ల మేర బెంగాల్ ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ల రూపేణా ఆదాయం వచ్చింది. గ్రేటర్ కోల్ కతాలో 2021లో 44,940 యూనిట్లు అమ్ముడయ్యాయని గణాంకాలు వెల్లడించాయి. ఇది 2020తో పోలిస్తే 64 శాతం అధికం కావడం విశేషం. ఈ నేపథ్యంలో మమత నిర్ణయం పట్ల సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి.

ప్రస్తుత పరిస్థితుల్లో రియల్ రంగానికి ఇలాంటి ఊరట కలిగించే నిర్ణయాలు తీసుకోవాల్సి ఉండగా.. తెలంగాణలో మాత్రం అందుకు విరుద్ధంగా జరుగుతోంది. స్టాంపు డ్యూటీలు తగ్గించడం మాట అలా ఉంచితే.. ఆరు నెల‌ల్లో రెండుసార్లు.. భూముల మార్కెట్ విలువలు, రిజిస్ట్రేషన్ ఛార్జీలను పెంచేశారు. ఫలితంగా ప్రజలపై తీవ్రమైన భారం మోపారు. ఈ సమయంలో ఇది సరైన నిర్ణయం కాదని పలు నిర్మాణ సంఘాలు మొత్తుకున్నా ప్రభుత్వం పెడ చెవిన పెట్టింది.

This website uses cookies.