- తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్
అధ్యక్షుడు సీహెచ్ ప్రభాకర్ రావు
సిమెంట్ సంస్థలు ఎప్పుడు పడితే అప్పుడు రేటు పెంచుకోవచ్చు.. ఈ కంపెనీలనూ ఎవరూ నియంత్రించరు. స్టీలు కంపెనీలు ఇష్టం వచ్చినట్లు ధర పెంచుకోవచ్చు. వీరినీ ఎవరూ ప్రశ్నించారు. ఇలాంటివి సుమారు 250 ఉత్పత్తులను ఒకచోటికి తీసుకొచ్చి.. అపార్టుమెంట్లను కట్టే డెవలపర్లను మాత్రం నియంత్రిస్తారు. ఇదెక్కడి న్యాయం? ఆయా సంస్థల్ని నియంత్రిస్తే.. నిర్మాణ వ్యయం తగ్గి.. అందుబాటు ధరలోనే ఫ్లాట్లను అందజేస్తాం కదా.. అలా కాకుండా, నిర్మాణ సంస్థల్ని నియంత్రించడం ఎంతవరకూ సమంజసం? ధర పెరగడానికి కారణమైన భవన నిర్మాణ సామగ్రిని ఉత్పత్తి చేసే సంస్థల్ని వదిలేసి.. బిల్డర్లను నియంత్రించాలని అనుకోవడం ఎంతవరకూ కరెక్టు అని సీహెచ్ ప్రభాకర్ రావు నిలదీశారు. ఇటీవల నగరంలో జరిగిన తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ నెలసరి సమావేశంలో రియల్ ఎస్టేట్ గురుతో ప్రత్యేకంగా మాట్లాడారు. సారాంశం ఆయన మాటల్లోనే..
‘‘రిసెషన్ ఇంకా లేదు. ఉద్యోగాలు పోలేదు. ఫైనాన్షియల్ క్రైసిస్ రాలేదు. ప్యాండమిక్ లేదు.. అయినప్పటికీ నిర్మాణ రంగం ఎందుకు కుదేలవుతుంది? ఇవేమీ లేకుండా బిజినెస్ పడిపోకూడదు. ఫ్లాట్ల రేట్లు ఎందుకు తగ్గుతాయి? హైదరాబాద్ రియల్ రంగంలో కొంత అనిశ్చితి నెలకొన్న మాట వాస్తవమే. ఎందుకంటే యూడీఎస్, ప్రీలాంచుల వల్ల సగం రేటుకే ఫ్లాట్లు లభిస్తున్నాయి కదా.. ఎక్కువ రేటు పెట్టి ఎందుకు కొనాలి అని కొందరు ప్రజలు అనుకుంటున్నారు. ఓ ఐదేళ్లు కళ్లు మూసుకుంటే.. ఫ్లాట్ చేతికొస్తుంది కదా అని భావిస్తున్నారు. పైగా, ట్రిపుల్ వన్ జీవో వల్ల భూముల ధరలు పడిపోతాయనే ప్రచారం ఊపందుకుంది. అమ్మకాల్లేవని.. మార్కెట్ పడిపోయిందని.. ఎక్కడో ఒక చోట వార్త వస్తూనే ఉంది. వాస్తవానికి, బయ్యర్ల ఎంక్వైరీలు గణనీయంగా పెరిగాయి. కాకపోతే, ఆశించిన మేరకు ఫ్లాట్లు అమ్ముడు కావట్లేదు. అమ్మకాలు కొంత తగ్గిన మాట వాస్తవమే. అలాగనీ బిల్డర్లు రేట్లు తగ్గించిన అమ్మే ప్రసక్తే ఉండదు. రానున్న రోజుల్లో రేట్లు పెరుగుతాయే తప్ప తగ్గే అవకాశమే లేదు. ఎందుకంటే, నిర్మాణ వ్యయం రోజురోజుకీ పెరుగుతుంది. ఈ నేపథ్యంలో రేట్లు పెరుగుతాయే తప్ప తగ్గవు. కొనుగోలుదారులు సొంతిల్లు కొనుక్కోవడానికిదే సరైన తరుణమని చెప్పొచ్చు.