ముంబై, బెంగళూరుకు చెందిన నిర్మాణ సంస్థలు.. హైదరాబాద్‌కు విచ్చేసి.. ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ పేరిట ఫ్లాట్లను విక్రయిస్తుంటే.. టీజీ రెరా అథారిటీ పెద్దగా పట్టించుకోనే పట్టించుకోదు. మరి, ఆయా సంస్థలంటే టీజీ రెరా ఛైర్మన్ సత్యనారాయణకు ఎందుకంత ప్రేమో ఎవరికీ అర్థం కావట్లేదు. మరి, ఈ విషయం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికైనా తెలుసో లేదోనని పలు నిర్మాణ సంస్థలు ప్రశ్నిస్తున్నాయి. కోకాపేట్‌లో ఆయా కంపెనీలు విచ్చలవిడిగా ప్రీలాంచుల్లో అమ్ముతుంటే.. రేపొద్దున ఆయా కంపెనీలు.. రేటు గిట్టుబాటు కాలేదనో.. పెద్దగా లాభం రాలేదనో.. ఇష్టం వచ్చినట్లు కట్టేసి వెళ్లిపోతే ఎలా? ఎందుకంటే ఇదివరకు ముంబైకి చెందిన ఒకట్రెండు నిర్మాణ సంస్థలు ఇలాగే వ్యవహరించిన విషయం చాలామందికి తెలియకపోవచ్చు.
సోషల్ మీడియాలో ఛానెల్ పార్ట్‌నర్లు ఇష్టం వచ్చినట్లుగా ప్రీలాంచుల్లో ఫ్లాట్లను విక్రయిస్తున్నా చూసీ చూడనట్లు వ్యవహరిస్తుంది. అదే హైదరాబాద్ రియల్ సంస్థలు ప్రీలాంచ్‌లో ఫ్లాట్లను అమ్ముతుంటే.. వారికి నోటీసులిస్తుంది. ఆయా సంస్థలు కన్సల్టెంట్ల ద్వారా ఆమ్యామ్యాల్ని సమర్పిస్తే.. ఎంచక్కా తీసేసుకుంటుంది. అంతేతప్ప, టీజీ రెరా వల్ల కొనుగోలుదారులకు పెద్దగా ఉపయోగం లేదనే చెప్పాలి. తప్పు చేసే బిల్డర్లపై కొరడా ఝళిపించాల్సిన అధికారులు.. నిమ్మకు నీరెత్తకుండా వ్యవహరిస్తే.. హైదరాబాద్ నిర్మాణ రంగం మరింత దారుణంగా దెబ్బ తింటుంది. ఏదో తూతూమంత్రంగా కొన్ని కేసుల్లో తీర్పులిస్తూ చేతులు దులిపేసుకుంటుంది తప్ప నిర్మాణ రంగానికి ఉపయోగపడే విధంగా టీజీ రెరా పెద్దగా పని చేయడం లేదనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయ్.
This website uses cookies.