పోలీసులు అరెస్టు చేయడానికొస్తే కుక్కులను వదిలే ప్రబుద్ధులున్న ప్రస్తుత తరుణంలో.. తనను అరెస్టు చేయడానికి వస్తున్న సీబీఐ అధికారుల నుంచి తప్పించుకోవాలనుకున్న ఓ బిల్డర్ సాహసం అతడిని గాయాలపాలు చేసింది. కాలు విరగ్గొట్టుకుని ఆస్పత్రిలో చేరే పరిస్థితి తీసుకొచ్చింది. ఢిల్లీ నుంచి వచ్చి గురుగ్రామ్ టాటా ప్రిమంటి సొసైటీలో నివసిస్తున్న సంజీవ్ కుమార్ అనే బిల్డర్ పై చీటింగ్, అవినీతి కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో ఆయన్ను అరెస్టు చేయడానికి సీబీఐ అధికారులు కుమార్ ఫ్లాట్ కు వచ్చారు. దీంతో వారి నుంచి తప్పించుకుని పారిపోవడం కోసం తాను ఉంటున్న మొదటి అంతస్తు బాల్కనీ నుంచి కిందకు దూకేశాడు. ఈ క్రమంలో కింద పడి కాలు విరగ్గొట్టుకున్నాడు. వెంటనే సీబీఐ అధికారులు అతడిని అదుపులోకి తీసుకుని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.