Categories: LATEST UPDATES

‘ట్రెడా’ బ్లడ్ క్యాంప్ సక్సెస్

తెలంగాణ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ (ట్రెడా) ఆరంభించిన ప్రప్రథమ బ్లడ్ డొనేషన్ క్యాంపు విజయవంతమైంది. సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ సహకారంతో ఆదివారం నానక్ రాంగూడ చౌరస్తాలోని ఎస్ అండ్ ఎస్ గ్రీన్ గ్రేస్ గేటెడ్ కమ్యూనిటీలో జరిగిన ఈ కార్యక్రమంలో నివాసితులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎస్ సీ ఎస్ సీ ప్రధాన కార్యదర్శి కృష్ణ ఏదుల మాట్లాడుతూ.. ‘‘ రాష్ట్రంలో రక్తం నిల్వలు కనిష్ఠ స్థాయికి పడిపోతున్నాయి. తలసేమియా పేషెంట్లకు క్రమం తప్పకుండా రక్తం ఎక్కిస్తేనే ప్రాణం నిలుస్తుంది. గుండె ఆపరేషన్లు, జనరల్ సర్జరీలు, మెటర్నిటీ పేషెంట్లు ఇలా రకరకాల అవసరాల నిమిత్తం రక్తం కావాలి. ప్రతిఒక్కరూ నాకెందుకులే అని కూర్చుంటే ఈ సమస్య ఎలా పరిష్కారం అవుతుంది? రేపొద్దున మనకో.. మనకు తెలిసినవారికో అత్యవసరాల్లో రక్తం అవసరమైతే ఎవరిస్తారు? ఇలాంటివన్నీ ఆలోచించే.. ప్రస్తుత సమాజానికి ఉపయోగమనే ఉద్దేశ్యంతో తెలంగాణ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ (ట్రెడా) బ్లడ్ డొనేషన్ క్యాంప్ లకు శ్రీకారం చుట్టింద‘‘ని తెలిపారు.

TREDA Blood Donation Camp

కరోనా విపత్కర సమయంలో రక్తదానం ఇవ్వవచ్చా? లేదా? అనే అంశంపై చాలామందిలో సందేహం నెలకొంటుంది. ఈ అంశంపై ట్రెడా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ విజయ్ సాయి మాట్లాడుతూ.. కరోనా వ్యాక్సిన్ యొక్క మొదటి లేదా రెండో డోస్ తీసుకున్న 14 రోజుల తరువాత రక్తదానం చేయవచ్చన్నారు. ఆర్ టీ పీసీఆర్ లో నెగటివ్ వచ్చిన పద్నాలుగు రోజులయ్యాక కూడా రక్తాన్ని దానం చేయవచ్చని తెలిపారు. పైగా, బ్లడ్ డొనేషన్ క్యాంప్ లో పాల్గొనే డాక్టర్లు, నర్సులు కొవిడ్ వారియర్లు కాబట్టి కరోనా ప్రోటోకాల్ ని పాటిస్తారు. శుభ్రత విషయంలో ఎక్కడా రాజీపడరు. ఒక వ్యక్తి బ్లడ్ ఇచ్చిన తర్వాత ఆ ప్లేస్ మొత్తం శానిటైజ్ చేశాకే మరో వ్యక్తిని అనుమతిస్తారు. పైగా, ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఈ క్యాంపు ఏర్పాటు చేస్తే అందులో నివసించే వారిని మాత్రమే ఆహ్వానిస్తారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రాబ్యాంకు మాజీ జీఎం రవికుమార్, ఎస్ అండ్ ఎస్ గ్రీన్ గ్రేస్ సంఘం సభ్యులు, ఇతర నివాసితులు పాల్గొన్నారు.

This website uses cookies.