ఉపహార్ థియేటర్ అగ్నిప్రమాదం కేసులో సాక్ష్యాలు తారుమారు చేసిన ఆరోపణలపై తమకు విధించిన ఏడేళ్ల జైలుశిక్షను సస్పెండ్ చేయాలంటూ రియల్ ఎస్టేట్ యజమానులు సుశీల్ అన్సల్, గోపాల్ అన్సల్ దాఖలు చేసిన పిటిషన్లను ఢిల్లీ కోర్టు తోసిపుచ్చింది. మేజిస్ట్రేట్ కోర్టు తీర్పును నిలిపివేయాలని, తమకు బెయిల్ మంజూరు చేయాలని వారు పెట్టుకున్న అభ్యర్థనకు అంగీకరించలేదు. 1997 జూలై 13న దేశ రాజధాని ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. గ్రీన్ పార్క్ ప్రాంతంలో ఉన్న ఉపహార్ సినిమా థియటర్ లో బోర్డర్ సినిమా ప్రదర్శన జరుగుతుండగా ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. ఈ ఘటనలో 59 మంది మరణించగా.. తొక్కిసలాట వల్ల 100 మందికి పైగా గాయపడ్డారు. అనంతరం ఈ ఘటనలో థియేటర్ యజమానులు అన్సల్ సోదరులపై కేసు నమోదైంది. దాదాపు 25 ఏళ్ల విచారణ తర్వాత ఇద్దరికీ రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. అయితే, ఢిల్లీలో ఆస్పత్రి నిర్మాణం కోసం ఇద్దరూ చెరో రూ.30 కోట్లు చెల్లిస్తే శిక్ష రద్దు చేస్తామని సుప్రీంకోర్టు పేర్కొనడంతో ఇరువురూ ఆ మొత్తం చెల్లించి జైలు నుంచి విడుదలయ్యారు. అయితే, ఈ కేసుకు సంబంధించి సాక్ష్యాలను తారుమారు చేశారనే ఆరోపణలపై ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టు ఇరువురికీ ఏడేళ్ల జైలు శిక్ష విధించింది.
This website uses cookies.