Categories: LATEST UPDATES

407 ప్రాజెక్టులు ఇక చెల్లవు

  • వాటి కాలపరిమితి తీరిపోయింది
  • మహారాష్ట్ర రెరా ప్రకటన
  • వాటిలో అమ్మకాలు చేయొద్దని స్పష్టీకరణ

మహారాష్ట్ర వ్యాప్తంగా 407 ప్రాజెక్టుల కాలపరిమితి తీరిపోయిందని, అందువల్ల వాటిలో ఎలాంటి అమ్మకాలూ చేపట్టరాదని మహారాష్ట్ర రెరా స్పష్టంచేసింది. వాటి రిజిస్ట్రేషన్ కాలావధి ముగిసిపోయినందున అవి ఇక చెల్లవని పేర్కొంది. ఈ నేపథ్యంలో నిబంధనల ప్రకారం ప్రమోటర్లు ఆయా ప్రాజెక్టులకు సంబంధించి ప్రకటనలు ఇవ్వడం, ఫ్లాట్ల విక్రయం చేయడం, కొనుగోలుదారులను ఆకర్షించడం వంటి పనులు చేపట్టకూడదు.

రాష్ట్రంలో ఎవరైన స్థిరాస్తి కొనుగోలు చేసేముందు మహా రెరా వెబ్ సైట్ లోని డేటా బేస్ లో వివరాలు సరిచూసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. అలాగే ప్రీ లాంచ్ ప్రాజెక్టుల విషయంలో కూడా అప్రమత్తంగా ఉండాలని పేర్కొంటున్నారు. మహారాష్ట్రలో 2017 మే ఒకటి నుంచి రెరా అమల్లోకి వచ్చింది. అయితే, అంతకుముందు నుంచే ఈ 407 ప్రాజెక్టుల పనులు జరుగుతున్నాయి. ఇప్పటికీ అవి పూర్తికాకపోవడంతో వాటిని కాలపరిమితి ముగిసిన ప్రాజెక్టులుగా రెరా పేర్కొంది. ఈ వ్యవహారంపై క్రెడాయ్ ప్రతినిధిని సంప్రదించగా.. దీనిని పరిశీలిస్తున్నట్టు వెల్లడించారు. త్వరలోనే ఈ సమస్యకు పరిష్కారం కనుక్కుంటామని తెలిపారు.

This website uses cookies.