Categories: LATEST UPDATES

తెలంగాణ‌లో 7.5% రిజిస్ట్రేష‌న్ ఛార్జీలు

తెలంగాణ రాష్ట్రంలో రిజిస్ట్రేష‌న్ ఛార్జీల‌ను ఏడున్న‌ర శాతం చేస్తూ రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకున్న‌ది. ఈ నెల 22 నుంచి చేసుకునే రిజిస్ట్రేష‌న్లకు కొత్త ఛార్జీలు వ‌ర్తిస్తాయి. ఇప్ప‌టికే స్లాట్లు బుక్ చేసుకున్న వారికీ ఇదే నియ‌మం వ‌ర్తిస్తుంది. ముందు బుక్ చేసుకున్నాం క‌దా.. త‌మ‌కు పాత రేటును వ‌ర్తింప‌జేయ‌మంటే కుద‌ర‌ద‌ని గుర్తుంచుకోండి.

తెలంగాణ కొత్త రాష్ట్రం ఏర్పడిన తరువాత ఐటి, ఫార్మా, టూరిజం, మౌలిక‌స‌దుపాయాల ప్రాజెక్టులు, ఇతర రంగాలలో గ‌ణ‌నీయంగా వృద్ధి చెందింది. కొత్త నీటిపారుదల ప్రాజెక్టులు విస్తారంగా వచ్చాయి. ఫ‌లితంగా భూమి విలువ‌లు పెరిగాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డ‌క ముందు 2013లో మార్కెట్ విలువ‌ల్ని స‌వ‌రించారు. దాదాపు ఏడేళ్ల త‌ర్వాత మార్కెట్ విలువ‌ల్ని పెంపొందించేందుకు తెలంగాణ ప్ర‌భుత్వం క‌స‌ర‌త్తు చేసింది. పైగా, సాటి రాష్ట్రాల‌తో పోల్చితే మ‌న వ‌ద్ద రిజిస్ట్రేష‌న్ విలువ‌లు త‌క్కువ‌గా ఉన్నాయి. స‌వ‌రించిన ఛార్జీల ప్ర‌కారం.. ఇక నుంచి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌తో పాటు తెలంగాణ రాష్ట్రంలోనూ 7.5 శాతం రిజిస్ట్రేష‌న్ ఛార్జీల‌ను వ‌సూలు చేస్తారు.

వ్యవసాయ భూములకు సంబంధించిన మార్కెట్ విలువ‌ను ఎక‌రానికి రూ.75,000గా నిర్ణ‌యించారు. త‌క్కువ ప‌రిధి గ‌ల వ్యవసాయ భూముల విలువల్ని 50% శాతం పెంచారు. మధ్య పరిధిలో 40% మరియు అధిక ప‌రిధిలో ఉన్న‌వి 30 శాతం పెంచారు. అదే విధంగా, ఓపెన్ ప్లాట్ల విషయంలో ఇప్పటివరకు గ‌జానికి అతి తక్కువ విలువ రూ.100 ఉండ‌గా.. రూ.200కు స‌వ‌రించారు. ఖాళీ ప్లాట్ల ప్రాథ‌మిక విలువ‌ను యాభై శాతం దాకా పెంచారు. మ‌ధ్య‌స్తంగా ఉన్న వాటిని 40 శాతం, అధికంగా ఉన్నవి 30 శాతం పెంచారు. ఫ్లాట్ల విలువ విష‌యానికి వ‌స్తే.. చ‌ద‌ర‌పు అడుక్కీ రూ.800 ఉన్న వాటిని రూ.1000కు స‌వ‌రించారు. త‌క్కువ ప‌రిధి ఉన్న చోట 20 శాతం, అధిక రేటున్న చోట 30 శాతం పెంచారు.

This website uses cookies.