మనదేశంలోని ప్రముఖ సీఅండ్ఐ ఫోకస్డ్ రెన్యువబుల్ ఎనర్జీ డెవలపర్ సెరెంటికా రెన్యువబుల్స్ తన ఇంధన నిల్వ సామర్థ్యం పెంచుకునేందుకు గ్లోబల్ ఎనర్జీ స్టోరేజ్ డెవలపర్ గ్రీన్ కో గ్రూప్ తో చారిత్రక ఒప్పందం చేసుకుంది. ఇందులో భాగంగా గ్రీన్ కో యొక్క ప్రత్యేకమైన ఇంధన నిల్వ సామర్థ్యాలను ఏపీ, మధ్యప్రదేశ్ లలో 1500 మిలియన్ వాట్ హవర్స్ తో రాబోతున్న ప్రాజెక్టులకు ఉపయోగించుకోనుంది. దీనివల్ల సెరెంటికా తన పారిశ్రామిక వినియోగదారులకు 24 గంటలూ 95 శాతం కంటే ఎక్కువ వార్షిక హామీతో సేవలు అందించే అవకాశం కలుగుతుంది. అంతేకాకుండా దేశంలోని కొన్ని ఎంపిక చేసిన పునరుత్పాదక జనరేటర్ ఐపీపీలలో ఒకటిగా కంపెనీని ప్రత్యేకంగా ఉంచుతుంది.
ఈ ఒప్పందంపై సెరెంటికా రెన్యువబుల్స్ డైరెక్టర్ ప్రతీక్ అగర్వాల్ మాట్లాడుతూ.. ‘దేశం ఇంధన వినియోగాన్ని డీ కార్బనైజ్ చేయడానికి, గ్రీన్ హౌస్ ఉద్గారాలను తగ్గించడానికి దీర్ఘకాల ఇంధన నిల్వ చాలా కీలకం. మేం పారిశ్రామిక వినియోగదారుల కోసం 24 గంటలూ పునరుత్పాదక శక్తిని అందజేయడానికి సిద్ధమవుతున్న తరుణంలో ప్రత్యేకమైన ఇంధన నిల్వ సామర్థ్యం కలిగిన గ్రీన్ కో తో చేసుకున్న ఒప్పందం మమ్మల్ని మరింత వేగవంతంగా ముందుకు తీసుకెళ్లనుంది’ అని పేర్కొన్నారు. ప్రపంచం స్వచ్ఛమైన ఇంధన దిశగా అడుగులేస్తున్న తరుణంలో విశ్వసనీయమైన, స్థిరమైన విద్యుత్ సరఫరాను నిర్ధారించడంలో ఇంధన నిల్వ పరిష్కారాలు కీలకపాత్ర పోషిస్తాయని వివరించారు.
This website uses cookies.